01-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేసీఆర్ చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్... గజ్వేల్లో విజయం సాధించారు.
అయితే తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్.. ముందుగా అసెంబ్లీలోని ఎల్పీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్పీకర్ ఛాంబర్కు చేరుకుని ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తుంటి ఎముక ఫ్యాక్చర్ కారణంగా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. గతేడాది డిసెంబర్ లో ఫాంహౌస్ ని బాత్రూమ్లో జారిపడిన కేసీఆరు తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనకు వైద్యులు తుంటి ఎముక శస్త్ర చికిత్స చేశారు. కొద్దిరోజుల పాటు చికిత్స అనంతరం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆ తరువాత ఇంటిలోనే మాజీ ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.