01-02-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా.. నేతల కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విరాజిల్లుతోంది. నాగోబా జాతర మేస్రం వంశీయుల (గిరిజనుల) అతి పెద్ద పండుగ. నాగోబా జాతర వేళలో ఆదివాసీలే కాదు ఆదివాసీయేతరులు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు. నేతలు సైతం భక్తి శ్రద్దలతో నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటారు. అలా మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్న వారిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో నిలిచారు.
తాజాగా సీఎం హోదాలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దర్శించు కోబోతున్నారు. కెసిఆర్ సిఎంగా ఉండగా నాగోబాను దర్శించుకోలేక పోయారు. తెలంగాణ రాష్ట్ర పండగగా కొనసాగుతున్న నాగోబాకు తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 2 న రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారిగా ఎంపీ పదవిలో కొనసాగిన సమయంలో.. 2021 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలానికి వచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఆ తరువాత ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక.. అదే ఏడాది 9 ఆగస్టు 2021న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో నిర్వహించిన 'దళిత గిరిజన' దండోరా భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మరుసటి ఏడాది 29 జనవరి 2022న నాగోబాను ముచ్చటగా మూడవసారి దర్శించుకున్నారు.
ఆ సమయంలో మరొసారి నాగోబా కు మీరు రావాలని.. ముఖ్యమంత్రి హోదాలో మా దైవాన్ని దర్శించుకోవాలని.. ఆ సమయం దగ్గరలోనే ఉందని.. మెస్రం వంశస్థులు ఆశీస్సులు అందించడం.. సరిగ్గా రెండేళ్లకు ఆ కల నెరవేరడంతో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా నాగోబాను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. పీసీసీ ఛీప్ గా నాగోబాను దర్శించుకున్న సమయంలో నాగోబా మురాడి దేవాలయ అభివృద్ధి కోసం సొంతంగా నిధులు అందజేస్తానని వారికి హామీ ఇచ్చారు. రూ.40 లక్షలు మేస్రం వంశీయులకు అందజేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నాగోబా ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యమంత్రి తొలి పర్యటన కావడం.. ఛలో ఇంద్రవెల్లి పేరిట విజయభేరి భారీ బహిరంగ సభ నిర్వహించనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొండత ఉత్సాహం కనిపిస్తోంది. నాగోబాను దర్శించుకున్న ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన దిగ్గజ నేతలే కావడం విశేషం.
మొట్టమొదటిసారి 1995లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు నాగోబా ను దర్శించుకున్నారు. ఆ సమయంలో నాగోబా ఆలయం శిథిలావస్థలో ఉండటంతో ఆలయ అభివృద్ధికి కోటి రూపాయల నిధులను అభివృద్ధి కోసం విడుదల చేశారు. ఆరేళ్ల తర్వాత 2001లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కెస్లాపూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆదివాసీ గిరిజనుల ప్రగతి కోసం పలు సంక్షేమ పథకాలను నాగోబా నుండే ప్రారంభించారు.
మరో ఆరేళ్ల తర్వాత 2006లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముచ్చటగా మూడవ ముఖ్యమంత్రిగా నాగోబాను దర్శించుకున్నారు. కెస్లాపూర్, ఇంద్రవెళ్లిలో పర్యటించి రైతుల కోసం సాగునీటి పథకాలు మంజూరు చేశారు. ఆ తర్వాత 2014 లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సారిగా దశాబ్దం తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రానున్నారు.