01-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశంచేశారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని అన్నారు. బీఆర్ఎస్ రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరు అదైర్యపడొద్దు.
అందరూ దైర్యంగా ఉండండని అన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తప్పేమి కాదు. కాంగ్రెస్ నేతల ట్రాప్ ఎమ్మెల్యేలెవరూ పడొద్దు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రిని కలిసినా మీ వ్యక్తిత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి. మనకు తొందరలేదు కాంగ్రెస్కు తగిన సమయం ఇద్దాం. మనం పెద్దగా తిట్టాల్సిన అవసరం లేదు.
వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు.. వాళ్లే దిగిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు సిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్కు దక్కుతుందని ఎమ్మెల్యేలు, ఎంవీలకు కేసీఆర్ సూచించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న కేంద్రం ప్రతిపాదనలపై కేసీఆర్.. ఎంవీలతో చర్చించారు.
ఈ విషయంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేపట్టాలని కేసీఆర్ సూచించారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి పార్టీ తరపున నిరసన తెలియజేసి, వినతి ఇవ్వాలని ఎంవీలకు చెప్పారు. రేపు (శుక్రవారం) పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆందోళనకు ఎంవీలు సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు.