02-02-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, ఫిబ్రవరి 2: ఏటా తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రథసప్తమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వాహనసేవలను వీక్షించేందుకు మాఢ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సును నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారని తెలిపారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదని ఈవో సూచించారు. టీటీడీ ఐటీ విభాగం 52 నకిలీ వెబ్సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్లను గుర్తించిందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.