02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: గద్దర్ కు పుస్తక ప్రదర్శన కూడా నివాళి అర్పించబోతున్నది. ఆయన పేరుతో వేదికను ఏర్పాటు చేయబోతోంది. సాహిత్యకారులు, పుస్తక ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పుస్తకాల జాతర మరో వారంలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ నెల 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పుస్తక ప్రదర్శన పోస్టర్ను గురువారం విడుదల చేశారు. పుస్తక ప్రదర్శన నిర్వహణకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ పుస్తకాల పండుగ ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల వేదికకు ఆధునిక తెలుగు నిఘంటుకర్త ఆచార్య రవ్వా శ్రీహరి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు గద్దర్ అభిమానులు అభినందిస్తున్నారు.