02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: నగరంలోని ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగం పుంజుకోనున్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులను ఆదేశిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలోమీటర్ల మేర రూ.670 కోట్లతో నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులకు 2018లో నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి వంతెన పనులు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కేవలం కిలోమీటరు దూరానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుండడంతో వాహనదారులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ఐదేళ్లుగా పనులు పూర్తి కావడం లేదని మంత్రి కోమటిరెడ్డి గురువారం నితిన్ గడ్కరీని కలిసి వివరించారు.