02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టాను ఏసీబీ విప్పుతోంది. మూడో రోజు విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. ఆ మూడు లాకర్లను ఓపెన్ చేయనుంది ఏసీబీ. శివబాలకృష్ణ బినామాలకు 2 నెలల క్రితం హోండాసిటీ కార్లను గిఫ్ట్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తోంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నలవర్షం కురిపించింది ఏసీబీ. దీంతో రెండో రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దికొద్దిగా సమాధానాలు చెబుతున్నాడు. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరాతీస్తోంది ఏసీబీ.
రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, ఆయన బినామాలు, పెట్టుబడులపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటి వాటిపై ఆరా తీస్తోంది.
శివబాలకృష్ణకు రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సత్య / మూర్తితో ఉన్న లింక్స్ పై విచారిస్తోంది. శివ బాలకృష్ణ అవినీతిలో మరో కోణంపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈయన అవినీతి వెనక అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు దర్యాప్తు సంస్థ అధికారులు.