02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ ఇప్పటికే పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సోదాలు, తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్, గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ ఏపీ పోలీసులు పట్టుబడటం కలకలం రేపుతోంది.
ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ గంజాయిని తరలిస్తూ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కారు. గురువారం రాత్రి బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోదాలు చేపట్టిన పోలీసులు వాహనాన్ని ఆపి అందులో తనిఖీలు చేశారు. ఈ వాహనంలో 22 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు.
మొత్తం 11 ప్యాకెట్లలో ఈ గంజాయిని ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 8 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాహనంలోని వారిని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు కాకినాడలోని మూడో బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గా గుర్తించారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన సాగర్ పట్నాయక్, శ్రీనివాస్ అనే కానిస్టేబుళ్లుగా పోలీసులు తెలిపారు.
గంజాయి సరఫరా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.
ఇదే మొదటిసారా లేక ఇంతకుముందు కూడా ఇలా అక్రమంగా రవాణా చేశారా అనే విషయాలను రాబట్టే పనిలో పడ్డారు. మరోవైపు గంజాయిని తరలిస్తూ హైదరాబాద్ లో ఏపీ పోలీసులు పట్టుబడటంతో ఆంధ్రప్రదేశ్లోనూ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ విషయంపై విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇద్దరు ఏపీ పోలీసులు.. రహస్యంగా గంజాయి తరలించేందుకు యత్నించి చివరకు తెలంగాణ పోలీసులకు చిక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.