02-02-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, ఫిబ్రవరి 2: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు.
మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. మూడుసార్లు సీఎంగా చేస్తే మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. నాడు ఎన్టీఆర్ కుటుంబంతో ప్రారంభమై నేడు వైఎస్సార్ కుటుంబం వరకు వచ్చాడు. ఇలాంటి అవకాశం ఇచ్చిన షర్మిలది తప్పు. వైఎస్సార్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది.
వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారు. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. వైఎస్సార్పార్టీ నుంచి తరిమేసిన నాయకులను అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజాగారు. తెలంగాణ అని పార్టీ పెట్టి, అక్కడ కాంగ్రెస్, టీడీపీ, జనసేన గురించి ఏం చేశారో ప్రజలు గమనించారు.
ఇప్పుడు ఆంధ్రాలో అబద్దాలు మొదలు పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు' అని అన్నారు. ఇదే సమయంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అంటున్న నాయకులు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి వచ్చి చూస్తే కళ్ళకు కనిపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.