02-02-2024 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ మోడల్, హీరోయిన్ పూనమ్ పాండే శుక్రవారం హఠాన్మరణం చెందారు. కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సిబ్బంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూనమ్ మరణించే సమయానికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని, ఉత్తర ప్రదేశలోని తన స్వగృహంలోనే ఆమె కన్ను మూసిందని మేనేజర్ పారుల్ వెల్లడించారు. ఇంటర్ చదువుతుండగా మోడలింగ్లోకి వచ్చిన పూనమ్ నషా చిత్రంతో బాలీవుడ్కి హీరోయినగా ఎంట్రీ ఇచ్చింది. అర్ధ నగ్న ఫొటోలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసేది. అందాల ప్రదర్శనే ఆమెను అనేక వివాదాల్లోకి లాగింది.
విమర్శలకు గురి చేసింది. హీరోయినగా కంటే ఆమె వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ మృతి చెందిందనట్లు పూనమ్ పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త విన్న పూనమ్ అభిమానులు షాక్కు గురవుతున్నారు. 'ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తుచేసుకోవాల్సి ఉంది' అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.
కాన్సూర్ లో జన్మించిన పూనమ్ పాండే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. తొలుత ఓ షార్ట్ ఫిల్మ్ నటించి 2013లో 'నషాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీతోపాటు కన్నడ, తెలుగు, బోజ్పురి భాషల్లో నటించింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో నటించింది. ఆమె నటించిన చివరి చిత్రం ద జర్నీ ఆఫ్ కర్మ. అయితే సినిమాల కన్నా ఆమె వివాదస్పద వ్యాఖ్యలతోనే ఫేమస్ అయింది. సెమీ న్యూడ్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కించేది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున జై శ్రీరామ్ అంటూ ఇనస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది పూనమ్. ఇంటిపై హనుమాన జెండా ఎగురవేసింది. తులసి మొక్క ముందు దీపారాధన చేసిన ఫొటోలను షేర్ చేసింది.
అయితే ఆ ఫోటోలో ఆమె కనిపించలేదు. ఆ తదుపరి మూడు రోజుల క్రితం ఓ క్రూజ్ షిప్ లో తన సిబ్బందితో ప్రయాణిస్తున్న వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. 2011 వరల్డ్ కప్ సమయంలో ఇండియా గెలిస్తే నగ్న ప్రదర్శన చేస్తానని ఓ వీడియో ద్వారా తెలిపి జనాలకు షాక్ ఇచ్చింది పూనమ్. బీసీసీఐ అందుకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెపై మండిపడటంతో వెనకడుగు వేసింది. 2020లో సామ్ బాంబేని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి.
శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ సందర్భంలో ఆరోపించింది. హనీమూన్ కోసం గోవా వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడికి దిగాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత ఆమె సామ్ కు విడాకులిచ్చింది. అప్పటి నుంచి పూనమ్ ఒంటరిగానే ఉంటోంది. 2014లో తన వ్యక్తిగత వెబ్ సైట్ లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసినందుకు గానూ అనేక విమర్శలు ఎదుర్కొంది. 2019లో పూనమ్ బోల్డ్ కంటెంట్, హాట్ ఫొటోలు, వీడియోలతో ఓ యాప్ డెవలప్ చేయించింది. దానిని లాంచ్ చేయడానికి ప్రయత్నించగా అది పాలసీలకు వ్యతిరేకంగా ఉందని గూగుల్ ప్లే స్టోర్ లో తిరస్కరించింది.
ఆ యాప్ ను కొంతకాలం తన పర్సనల్ వెబ్సైట్ లో ఉంచింది. తర్వాత ఆ సైట్ నుంచి కూడా ఆ కంటెంట్ ను తొలగించారు. లాక్ డౌన్ సమయంలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కరోనా- లాక్ డౌన్ లో వీధుల్లో తిరగడానికి అనుమతి లేని సమయంలో నిబంధనలు లెక్క చేయకుండా భర్తతో కలిసి వీధుల్లో విహరిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా నుంచి కూడా ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి.