03-02-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, ఫిబ్రవరి 3: అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామంటూ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఈఓ పైర్ అయ్యారు. అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామని ఈఓ ధర్మారెడ్డి ప్రకటించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
అన్యమతస్థుల సేవలను వినియోగించుకుంటామని ధర్మారెడ్డి ఏ హోదాలో ప్రకటిస్తారని ప్రశ్నించారు. టీటీడీ ఈఓ అయితే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా అని నిలదీశారు. అన్యమతస్థుల సేవలు టీటీడీకి అవసరం లేదన్నారు. ధర్మారెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టీటీడీలో అనేక మంది అన్యమతస్థులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.
స్వామి వారికి మొక్కని వారు టీటీడీలో విధులు నిర్వర్తిస్తూ జీతాలు తీసుకుంటున్నారన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.