03-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 3: షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు' అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్టర్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారని.. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. షర్మిల, సునీతలపై జగన్ కు గౌరవం లేదన్నారు. సొంత చెల్లెళ్ళపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట్లు చెబుతారని మండిపడ్డారు.
షర్మిలపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనని బెదిరిస్తున్నారని వివేకా కూతురు బాధపడుతోందన్నారు. కాంగ్రెస్ లేకపోతే జగన్ ఎక్కడ ఉండేవారని వి.హనుమంతరావు ప్రశ్నించారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని ఆరోపణలు చేస్తూ పోస్టర్స్ వేస్తుంటే జగన్ సైలెంట్ గా ఉండడం ఏంటని నిలదీశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్నకి సపోర్ట్ చేశారని.. ఆయన సిఎం కావడానికి తనవంతుగా ప్రచారంతో కృషి చేశారని అన్నారు. అయితే రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అంటూ విమర్శించారు.
షర్మిలపై ఇలాంటి పోస్టర్స్ వేస్తుంటే బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా చెడు సంప్రదాయాలని జగన్ పక్కన పెట్టాలని హితవుపలికారు. పవర్ ఉందని జగన్ ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ది చెప్తారని హెచ్చరించారు. జగన్ తన సొంత చెల్లెలిపై కక్ష సాధింపు మానుకోవాలన్నారు. సునీత న్యాయం కోసం పోరాడుతోందని తెలిపారు.
షర్మిలపై పోస్టర్స్ వేసిన వాళ్లపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు చెల్లికి అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని.. రేపు తల్లికి అవమానం జరిగినా పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఏపీకి వెళ్ళగానే జగన్ కు భయం పట్టుకుందన్నారు.