03-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 3: రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తారని ఆమె ప్రశ్నించారు. శనివారం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నేతలను ఆహ్వానిస్తే నల్ల బెలూన్లు ఎగరేస్తామని స్పష్టం చేశారు.
ఇంద్రవెల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. అమర వీరులకు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లిలో ఉదయం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే సాయంత్రం పార్టీ సభ నిర్వహించారని పేర్కొన్నారు. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన సభ ఖర్చెంత అని నిలదీశారు. 'సీఎం రేవంత్ రెడ్డి చార్టర్డ్ ఫ్లెట్లలో ఢిల్లీకి వెళుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల ఖర్చు ఎంతని ప్రశ్నించారు. తనకు కాన్వాయ్ అక్కర్లేదని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నగరంలో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. 'మేం పాలనను వికేంద్రీకరించాలని కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరుతో కేంద్రీకరణ కోరుకుంటున్నది. ప్రజా దర్బార్ ఒక రోజు మురిపమే. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజే ప్రజా దర్బార్కు వచ్చారు.
రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన బాటనే కోరుకుంటున్నారు' అని అన్నారు. "ప్రతి రోజూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో 22 కుటుంబాలకు పార్టీ టికెట్లు ఇచ్చారు. అటువంటప్పు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా?” అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి 'యూటర్న్ సీఎం’ అని రాష్ట్ర ప్రజలంతా అంటున్నారని అన్నారు.
ప్రభుత్వ హామీలపై 100 రోజుల తర్వాత ప్రజా క్షేత్రంలో ఖచ్చితంగా నిలదీస్తాం అని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్పార్టీ ఇప్పటికైనా తప్పులు తెలుసుకోవాలన్నారు. అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని పిలుస్తామని అంటున్నారని, ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్గానైనా గెలిచారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని పిలిస్తే నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతామని కవిత స్పష్టం చేశారు.
కుటుంబ పాలన అని కేసీఆర్పై ఏడ్చిన కాంగ్రెస్ 22 కుటుంబాలకు టికెట్ ఇచ్చిందని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నోటా ఇప్పటి వరకు జై తెలంగాణ అన్న మాట రాలేదని, అమరులకు కనీసం నివాళులు కూడా అర్పించలేదన్నారు. అమర జ్యోతి వద్దకు వెళ్ళే తీరిక కూడా లేదని విమర్శించారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడతారా లేదా? అని ప్రశ్నించారు. బీసీ జనగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన నియామకాల్లో ఎస్సీ, బీసీల వాట ఎంత అని నిలదీశారు.
అందరినీ పిలిచినట్లే కంచ ఐలయ్యను తమ రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచామని కవిత అన్నారు. సీఎం దగ్గర మార్కులు కొట్టేయడానికి కంచ ఐలయ్య అలా మాట్లాడారని అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తామని కవిత స్పష్టం చేశారు. ఇకపోతే గత అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి నోట ఇప్పటివరకూ జై సోనియమ్మ అనే తప్ప జై తెలంగాణా అని ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సభల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారని ఇది ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరులు జిల్లా సమీక్షా సమావేశాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని పెడతారా పెట్టరా ముఖ్యమంత్రి తేల్చి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారని, వీటిని డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో చెప్పాలని కవిత ప్రశ్నించారు.