03-02-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, ఫిబ్రవరి 3: దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా అద్వానీకి భారతరత్నపై స్పందించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'కు ఎంపికైన ఎల్ కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు. అద్వానీ దేశం పట్ల అంకితభావం, ఆదర్శప్రాయ కృషి చేశారని అన్నారు.
పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన అద్వానీ దేశానికి అసాధారణమైన సేవలను అందించారని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఆయన ఆప్యాయత స్వభావం ప్రతి ఒక్కరిపై చెరగని ముద్రవేస్తుందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గతంతో అద్వానీతో దిగిన ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.