03-02-2024 RJ
తెలంగాణ
భద్రాచలం, ఫిబ్రవరి 3: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. శనివారం ఆయన భద్రాచలం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత సంస్కారహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్దమేనని హరీశ్ రావు ఆరోపించారు.
అసెంబ్లీలోనూ అబద్దాలే.. ఆదిలాబాద్ లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెన్ తెచ్చిన మార్పు సున్నా అని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇదేనా కాంగ్రెన్ పార్టీ తెచ్చిన మార్పు అని నిలదీశారు. రాష్ట్రంలో తిరోగమనం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని చెప్పారు. అదానీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకున్నదని ఆరోపించారు.
దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని హరీశ్ రావు ఆక్షేపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగానే ఆమోదించారు. ఎవరు ఎవరు కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు బండి నంజయ్, ఈటల రాజేందర్ లను బీఆర్ఎస్ పార్టీ ఓడించిందని గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్లకు ప్రకటించిన పెన్షన్ రూ.4000 కాదు కదా.. ఇప్పటి వరకూ ఇచ్చిన రూ.2000 పెన్షన్ కూడా ఇవ్వలేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రోజూ కరంట్ ఆరుసార్లు పోతున్నదని ప్రజలు చెబుతున్నారని అన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు అన్నీ ఇన్నీ కాదని, ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకు ఈడ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణ మాఫీ హామీ సంగతేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. తిట్ల పురాణం తప్ప మీరు చేసిందేమిటని నిలదీశారు. రైతులకు రుణ మాఫీ హామీ ఏమైందన్నారు. ఈ నెల నుంచే రూ. 4000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని అన్నారు. కానీ మన్యాన్ని విష జ్వరాల నుంచి కాపాడింది బీఆర్ఎన్ అని గుర్తు చేశారు. అంతకు ముందు హరీష్ రావు భద్రాచల రామయ్యను దర్శించుకున్నారు.