03-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చిందని, మేనిఫెస్టోను పట్టించుకోవడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని రేవంత్ రెడ్డి అన్నారని.. ప్రతి హామీని అమలు చేస్తామని వందల సార్లు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని చెప్పారు.
కానీ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని.. అందుకు సాక్ష్యం మీ మేనిఫెస్టోనే అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం.. అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ -1 నియామకాలను చేపట్టాల్సి ఉంది. అందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
ఫిబ్రవరి 2 గడిచినా కానీ ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ల ఊసే లేదని.. కనీసం నోటిఫికేషన్ కు సంబంధించి ప్రకటన కూడా లేదన్నారు. మీరు పవిత్రంగా భావించే భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి మేనిఫెస్టోను మీరే అమలు చేయకుంటే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పవిత్ర గ్రంథమంటే మీకు అంత చులకనా? ఎలక్షన్ వరకే మేనిఫెస్టో మీకు పవిత్ర గ్రంథమా? తరువాత మీకు అది చిత్తు కాగితమా? అంటూ మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులు పదేళ్లుగా ఉద్యోగాల్లేక అల్లాడుతున్నరని కాంగ్రెస్ నేతలే పలుమార్లు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. వెంటనే గ్రూప్-1 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లోనే ఏప్రిల్ 1 నాటికి గ్రూప్ -2 నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది.
మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలుండే అవకాశముందని... గ్రూప్ -1 తోపాటు గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయ్యింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశముంది. 6 గ్యారంటీ హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశముంది. కనుక కాంగ్రెస్ 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని.. అందుకు సంబంధించి నిధులను పూర్తిగా సమీకరించుకోవాలని సూచించారు. యాసంగి సీజన్ మొదలై రెండు నెలలైనా.. రైతు బంధు వేయలేదని, ఎకరాకు 15 వేల రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి స్కీం, కానీ ఆ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు గిరాకీ లేక అల్లాడుతున్నారని.. కొందరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
గిరాకీ లేక ఇల్లు గడవక ఉన్న ఆటోను ఓ ఆటో డ్రైవర్ ప్రగతి భవన్ వద్ద ఆటోను తగలబెట్టడం బాధాకరం అన్నారు. ఆటో డ్రైవర్ల ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకుని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తక్షణమే ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి, ప్రజలకు గ్యారంటీ మోదీ మాత్రమేనని.. ఇచ్చిన మాట ప్రకారం 370 ఆర్టికల్ రద్దు చేశారని గుర్తుచేశారు.
పేదలకు ఇల్లు కట్టించారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందించారు. రామ మందిరం నిర్మించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కాని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.