03-02-2024 RJ
తెలంగాణ
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 3: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కు సంబంధించి బీజేపీ నేత, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
‘మహబూబ్ నగర్ గడ్డ.. జితేందర్ రెడ్డి అడ్డా. మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ నాదే. నాకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదముంది. టికెట్ కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. డీకే అరుణకు టికెట్ ఇస్తే.. ఆమెకు సహరించే విషయంపై అప్పుడు ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం కోసం తాను ఏం చేశానో పార్టీ పెద్దలకు తెలుసన్నారు. తన పనితనం ఆధారంగానే మహబూబ్ నగర్ టికెట్ వస్తుందని డిమాండ్ చేశారు.
రెండుసార్లు ఎంపీగా మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేశానన్నారు. 'నా కుమారుడి ఇన్ కంటాక్స్ వేరు. నా ఇన్ కంటాక్స్ వేరే. నా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని ఏమిలేదు' అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన ఉందన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై గతంలో సీబీఐ విచారణ కోరిన సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు విచారణ కోరటం లేదని ప్రశ్నించారు. మోదీ చరిష్మా ముందు కాంగ్రెస్ నిలబడలేదని.. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.