10-02-2024 RJ
తెలంగాణ
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రైతులకు సంబంధించి ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మార్గదర్శకాలు ఖరారు చేసిన అనంతరం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
సరైన అర్హులకే రైతు భరోసా.. ఎన్నికల సమయంలో రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ. 15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హమీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని భట్టి స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వం హయాంలో చేసినట్లు ఎవరికిపడితే వారికి రైతు భరోసా సాయం ఇవ్వమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు సాయాన్ని ఇచ్చి వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అలా చేయదని చెప్పారు. అసలైన అర్హులను గుర్తించి వ్యవసాయ భూములకే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.
అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి మార్గదర్శకాలు తీసుకొస్తామన్నారు. రైతు బీమా పథకాన్ని కూడా కౌలు రైతులకు వర్తింప జేసి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్పూర్తితో రాష్ట్రంలోని రైతులకు కూడా పంట బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు మంత్రి వివరించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. ధరణి రైతులపాలిట శాపంగా మారిందని వాటి సమస్యలను త్వరలోనే తొలగిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 500కే వంట గ్యాస్ అందజేస్తామని మరోసారి తెలిపారు. త్వరలోనే.. ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు.