13-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఏపీకు విశాఖని రాజధానిగా ప్రకటించామని, అది పూర్తి అయ్యే వరకు హైదరాబాద్‌ను కూడా తమ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగించాలని వైసీపీ అగ్ర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్‌ను ఏపీకు రాజధానిగా కొనసాగించాలనే వైసీపీ నేతల డిమాండ్ హాస్యాస్పదంగా ఉందన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వారిద్దరి వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడబోరని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ చూస్తూ ఊరుకోరని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఏపీని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. వారి స్వార్థ పూరిత రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.