14-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్ డైరెక్టర్ గా ఐపీఎస్ కె.అపూర్వరావు మంగళవారం హైదరాబాద్ బస్ భవన్ లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. టీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా అపూర్వరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కు చెందిన ఆమె 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి కాగా, గతంలో వనపర్తి, జోగులాంబ - గద్వాల, నల్లగొండ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా తొలి మహిళా ఐపీఎస్ అధికారి నియామకం చరిత్రాత్మకం.
బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావును అభినందించిన సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ కోరారు. ప్రజారవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి మహిళా ఐపీఎస్ అధికారిని జాయింట్ డైరెక్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను జాయింట్ డైరెక్టర్ గా నియమించినందుకు కె.అపూర్వరావు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఆమె హామీ ఇచ్చారు.