14-02-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, ఫిబ్రవరి 14: చెక్ బౌన్స్ కేసులో సినీనటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలులోని రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు వెలువరించారు. జె.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.95 లక్షల చెక్కును అందజేశారు.
వెంకటేశ్వర్లు చెక్కును బ్యాంకులో జమ చేయగా బండ్ల గణేష్ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. సినీ నిర్మాతపై వెంకటేశ్వర్లు కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో బండ్ల గణేష్ దోషిగా తేలాడు. ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు పిటిషనర్ కు రూ.95.10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. తెలంగాణకు చెందిన బండ్ల గణేష్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.