22-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఈరోజు సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. గృహజ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలకి సంబంధించి అమలు చేసేందుకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ శ్రీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.