27-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టును విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల లైఫ్ సైన్సెస్ కాన్ఫరెన్స్ 'బయో ఏషియా 2024' ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీ రెండో దశను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల రెండో దశను ప్రమోట్ చేయనుంది. వీటితో పాటు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న పది ఫార్మా విలేజ్ లను ప్రోత్సహిస్తామన్నారు.
వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా విలేజ్ ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించామన్నారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంక్యుబేటర్లు, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో 200కు పైగా కంపెనీలు ఉన్నాయి. నోవార్టిస్, గ్లాక్సో స్మితక్లైన్, డ్యూపాంట్, భారత్ బయోటెక్, లోంజా వంటి వివిధ కంపెనీల్లో 1,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.