01-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 1: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లాలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు జిల్లాను జల్లెడ పడుతున్నాయి. జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.
జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉన్నందున అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. పరీవాహక ప్రాంతం వెంట కూంబింగ్ ముమ్మరం చేశామని, సంఘ వ్యతిరేక శక్తులు జిల్లాలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో నాటుసార కేంద్రాలు, బెల్టు దుకాణాలను అరికట్టడంతో పాటు విక్రయాలు జరిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇతరులను కించపరిచేలా మాట్లాడటం, సోషల్ విూడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేందుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మద్యం తరలింపు పైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలిపోకుండా ప్రత్యేక తనిఖీలు సైతం చేపడుతున్నారు.