02-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 2: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత నాటి సిఎం కెసిఆర్‌దని నిజామాబాద్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కానీ నాలుగు నెలలకే కాంగ్రెస్ మడత చుట్టేసిందని, అభివృద్ది వెనక్కి పోయిందని అన్నారు. నీళ్లు, కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌దని బాజిరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలంగాణలో మాత్రమే అన్నారు. గత పాలకులు 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిళ్లలో చేసి చూపించారని పేర్కొన్నారు.
తెలంగాణలో కరువును పారదోలేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. దీంతో పాటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి ఆధునిక జలాశయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అలాగే భూగర్భజలాలలు పెరిగాయన్నారు. రైతులకునీరు, రైతుబంధు సాయం వంటివి అందడం,ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంతో వారు సుఖంగా ఉన్నారని అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రాకున్నా కెసిఆర్ ముందుకు వచ్చి ధాన్యం కొనుగోళ్లను చేపట్టారని అన్నారు. దిగుబడి పెంచేందుకు రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించేలా చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీటిని కొనసాగించడం లేదన్నారు.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. పేదలు, రైతులకు సంక్షేమ పథకాలు పక్కాగా అందాయని గుర్తుచేశారు. రైతులకు వరికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు నోరెత్తడం లేదని విమర్శించారు. ప్రజలను అబద్దాలతో ఆగంచేసే కాంగ్రెస్, బీజేపీ కావాలా.. అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్ కావాలో ప్రజలు నిర్ణయించు కోవాలని సూచించారు.