02-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 2: తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని, టిడిపిని నమ్మి కేసులకు సైతం జడవకుండా పోరాడుతున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్‌తో గెలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు చంద్రబాబు అద్భుత పాలన సాగించారని అన్నారు. అమరావతి నిర్మించకుండా జగన్ నమ్మక ద్రోహం చేశాడని విమర్శించారు. అయినా మొక్కవోని విశ్వాసంతో చంద్రబాబు ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపారని, అయితే జగన్ పాలనలో ఎపి వెనక్కి పోయిందని అన్నారు.
జగన్ టిడిపిని దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నా.. అంతిమ విజయం టిడిపిదేనని విమర్శించారు. ఎన్నికల్లో వీరి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమై పోయిందని అన్నారు. తెదేపాకు సానుకూల పరిస్థితులు వున్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మరచిపోలేదని చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం చేపట్టారని, పరిశ్రమలు సైతం తీసుకొచ్చారని చెప్పారు. కానీ సిఎం జగన్ వచ్చాక ఇవన్నీ మాయం అయ్యాయని అన్నారు.