02-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 2: భానుడి ఉగ్రరూపంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గత వారం రోజుల కంటే ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. ఎన్నికల కాలం కావడంతో ప్రజలు బయటకు రావాల్సి వస్తోంది. నేతలు కూడా ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9గంటల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాయంత్రం వరకూ వడగాల్పులు వీచడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. రోజురోజుకు సూర్యుడు ప్రతాపం చూపడంతో రహదారులు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమైన ఎండ, వేడి గాలులు వీచినప్పుడు వడదెబ్బ సోకుతోంది.
శరీర ఉష్ణోగ్రత పెరగడంతో తలనొప్పి వస్తోంది. నాడి వేగంగా కొట్టుకోవడం నాలుక ఎండి పోవడం శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక, లేదా పూర్తిగా అపస్మారకం చేరడం వంటి లక్షణాలు కలిగి ఉంటే వడదెబ్బ సోకినట్లుగా గుర్తించవచ్చు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో తిరగటం, పని చేయడం, ఆడటం చేయరాదు. తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సి వస్తే తలపై టోపి, గొడుగు, తెల్లని వస్త్రం కప్పుకోవాలి. తెల్లని నూలు వస్త్రాలు మాత్రమే ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌లోనే ఈవిధంగా ఉంటే రానున్న మేలో ఏ విధంగా ఎండలు మండుతాయోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే వేసవి ప్రారంభంలోనే విపత్తుల నిర్వహణపై అధికారులతో పాలనాధికారి సమావేశం నిర్వహించి రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ నుంచి నివారణ చర్యలు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. రానురాను ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక పొట్ట కూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కూలీలు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమించడంతో వారు ప్రాణం విూదకు తెచ్చుకోవాల్సి వస్తోంది. వడదెబ్బపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ప్రణాళిక రూపొందించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో మినహాయిస్తే మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకు నీడ పట్టునే ఉంటే మంచిదన్న అభిప్రాయంతోపాటు ఏ గ్రామంలోనైనా వడదెబ్బతో మృతిచెందినా, ఇతర ఏ కారణంతో మరణించినా తక్షణమే వీఆర్‌ఏ సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
ఏ గ్రామంలో నీటి సమస్య ఉంటే ఆయా గ్రామాల్లో నోడల్ అధికారిని భర్తీ చేసుకుని అతని ద్వారా ఆయా సమస్యలను తీర్చుకునేలా ప్రతి అవాసానికి వీఆర్‌ఏకు బాధ్యతలు అప్పగించారు. అయితే మంచినీటి ఎద్దడి నివారణ సమస్యలు కాస్తా పరిష్కారానికి చర్యలు చేపట్టినా, క్షేత్ర స్థాయిలో వడదెబ్బపై ప్రచారం పూర్తిగా చేపట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి కూలీలకు ఓఆర్‌ఏస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటినుంచి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అడ్డుకట్టకు కృషి చేయాల్సిన అవసరం ఆయాశాఖల అధికారులపై ఎంతైనా ఉంది.