02-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కడప, మే 2: ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి గురువారం ప్రచారం ప్రారంభించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్‌ఆర్‌కు వివేకా అలా ఉండేవారని వివరించారు. హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కట్టాలని వైఎస్.షర్మిల ప్రశ్నించారు. గురువారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎపిసిసి చీఫ్, కడప ఎంపి అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్.షర్మిలా రెడ్డి మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌ఆర్‌కి వివేకా అలా ఉండేవారని చెప్పారు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యిందని.. ఆయన్ను చంపేశారు..హత్య చేశారు అని, గొడ్డలితో 7 సార్లు అతి క్రూరంగా నరికి హత్య చేశారని తెలిపారు. ఎముకలు, మెదడు బయటకు వచ్చేలా నరికి చంపారని, ఎవరు చంపారో అందరికీ తెలుసునని అన్నారు. సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇవి తాము చెబుతున్నది కాదు అని, సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలు అని చెప్పారు. చంపించిన వారికి, చంపిన వారికి ఈరోజుకి శిక్ష లేదని, చనిపోయింది వైఎస్‌ఆర్ తమ్ముడు అని అన్నారు.
హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి అడ్డం పడ్డారని ఆరోపించారు. ఎందుకు హంతకులను వెనకేసుకు వస్తున్నారు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని షర్మిల అడిగారు. హత్య జరిగినప్పుడు సిబిఐ విచారణ కావాలని అడిగారనీ.. అధికారంలో వచ్చాక సిబిఐ విచారణ వద్దు అన్నారని ? సిబిఐ విచారణ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారు ? అని ప్రశ్నించారు. హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ? అని అడిగారు.
అధికారం అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు ? ఇది అన్యాయం.. అక్రమం.. ఇది అధర్మం? అని అన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు తాను నిలబడ్డానన్నారు. తాను వైఎస్‌ఆర్ బిడ్డనని, దేనికి భయపడను అని, న్యాయం వైపు తాను నిలబడ్డానని షర్మిల స్పష్టం చేశారు.కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం. విూరు న్యాయం వైపు నిలబడతారని అనుకుంటున్న. నేను విూ బలం, నేను విూ గొంతు. విూ బిడ్డగా ఇక్కడే ఉంటా. విూ కోసమే నా జీవితం అంకితం. న్యాయం కోసం ప్రతి ఒక్కరినీ ప్రార్థిస్తున్నా. దయచేసి తమకు న్యాయం చేయాలని ప్రజలను వైఎస్ షర్మిల కోరారు.