02-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 2: ఎన్నికల వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది.
తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ సీపీ నిర్ధిష్టమైన సూచనల మేరకు సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఎస్వోటీ పోలీసులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబందితో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువగల నాలుగువేల లీటర్స్ మద్యం పోలీసులకు చిక్కింది.
మొత్తం మూడు ప్రాంతాల్లో మద్యంతో పాటు నగదును పోలీసులు పట్టుకున్నారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.21,53,470 విలువగల 2597.88 లీటర్ల మద్యం పట్టుబడింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పేట్ బషీరాబాద్ పీఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.15,46,340 విలువగల 1916.2 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.ఎస్వోటీ బాలానగర్ టీం, కేపీహెచ్‌బీ పోలీసులు రేడియంట్ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూఆర్ కోడ్ లేకుండా తరలిస్తున్న రూ.1,24,626 నగదును పోలీసులు పట్టుకున్నారు.