02-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, మే 2: ఏపీ ఎన్నికల్లో రాజకీయమంతా కాపుల చుట్టూ తిరుగుతోంది. వారి ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఆయకు కొంతమేర మద్దతు పెరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరడంతో ఆయన కూడా కొంతమేర ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరి ఓట్లు ఎవరికి పడతాయన్నచర్చ సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభంలలో ఎవరు ఎక్కువ సీట్లపై ప్రభావం చూపుతారన్న చర్చ కూడా సాగుతోంది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా కాపు సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువమంది వైసీపీకి ఓట్లు వేసినట్లు గత ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో కాపుల ఓట్లు 3పార్టీలకు చీలిపోవడంతోనూ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ముఖ్యంగా మొన్నటివరకు కాపుల్లో ఐక్యత లేదనే ప్రచారం ఆ సామాజికి వర్గానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సామాజికవర్గం ఓట్లు ఎవరికి పడతాయనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
కాపు సామాజిక వర్గంలో పెద్దలుగా చెప్పుకునే ఒకరిద్దరిని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించవచ్చనే వైసీపీ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంతో పవన్‌కళ్యాణ్‌ను తిట్టించి.. పార్టీలో చేర్చుకోవడం ద్వారా పద్మనాభంపై కాపులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ద్వారా కాపులంతా పవన్‌కళ్యాణ్‌కే మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపులు వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తమ సామాజికవర్గానికి కలిసొచ్చేది ఏమి లేదని, రాజకీయంగా తాము ఉనికిని కోల్పోయే ప్రమాదముందనే విషయాన్ని కాపు నేతలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు జనసేనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కాపులు జనసేనకు మద్దతిచ్చి.. ఎక్కువ సీట్లు గెలిపిస్తే.. తమ సామాజిక వర్గానికి రాజకీయ పలుకుబడి మరింతగా పెరుగుతుందనే ఆలోచనలో కాపులు ఉన్నట్లు తెలుస్తోంది.