02-05-2024 RJ
సినీ స్క్రీన్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ’హరిహర వీరమల్లు’ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం మొదలైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం నిర్మాతగా ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావొస్తున్నా... ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కారణం పవన్ జనసేన పార్టీ పనుల్లో నిమగ్నం కావడం, ప్రచారంలో బిజీ కావడం. దర్శకుడు క్రిష్ మాత్రం మూడేళ్లు ఇదే ప్రాజెక్ట్ విూద ఉన్నారు. ఇంకా లేట్ అవుతున్న నేపథ్యంలో ఆ గ్యాప్‌లో క్రిష్ అనుష్కాశెట్టితో ఓ సినిమా మొదలుపెట్టారు.
తాజాగా గురవారం 'ధర్మం కోసం యుద్ధం 2024’ అనే ట్యాగ్‌లైన్‌తో ’హరిహర వీరమల్లు’ చిత్రం అప్‌డేట్ ఇస్తూ పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేశారు. తాజా పోస్టర్‌లో చిన్న మార్పు కనిపించింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పక్కన మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. ఎ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పేరు దర్శకత్వ విభాగంలో చేరింది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ కూడా ఇచ్చింది. 'ఎనక్కు 20 ఉనక్కు 18’, ’నీ మనసు నాకు తెలుసు’, ’ఆక్సిజన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన జ్యోతికృష్ణ పలు చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు.
ఆ అనుభవంతో ఆయన ’హరిహర వీరమల్లు’ చిత్రం మిగతా షూటింగ్‌ను, నిర్మాణానంతర కార్యక్రమాలను క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేస్తారని పేర్కొన్నారు. అంతే కాదు ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. క్రిష్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్ పర్యవేక్షణలో జ్యోతికృష్ణ మిగతా భాగాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తాడనే చర్చ మొదలైంది ఇప్పుడు. నిధీ అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.