04-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు, మే 3: ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ప్రజలకు కూడా తెలిసిపోయిందని అన్నారు. పొదిలిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
గిద్దలూరు చెత్త మార్కాపురంలో బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. శేషాచలం స్మగ్లర్ చెవిరెడ్డి కావాలా... ప్రజానాయకుడు మాగుంట కావాలో తెలుసుకోవాలని కోరారు. పింఛన్లు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. పింఛన్ రూ. 200 నుంచి రూ. 2000 చేసిన ఘనత తమ పార్టీదని తెలిపారు. పింఛన్ల పంపిణీ విషయంలో సీఎస్ జవహర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. తండ్రి, బాబాయి చావును అడ్డుపెట్టుకొని గత ఎన్నికల్లో జగన్ పోటీ చేసి గెలిచారని చెప్పుకొచ్చారు.
2014 మంచి 2019 వరకు వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిగెత్తించానని తెలిపారు. నీళ్లు లేని వెలిగొండ ప్రాజెక్టుకు జగన్ రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. 2024లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి మార్కాపురం, పొదిలి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తానని హావిూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మార్కాపురాన్ని జిల్లాగా చేస్తానని చంద్రబాబు హావిూ ఇచ్చారు.