06-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 6: కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి రాష్టాన్రికి, హైదరాబాద్ నగరానికి ఒరగబెట్టిందేవిూ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కనీసం సొంత నియోజకవర్గానికి కూడా సేవలచేయలేదన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్‌పేటలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి అయిందన్నారు.
గత కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని చెప్పారు. ఇకపై అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు. మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని.. దానం నాగేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. అప్పుడే దేశానికి విముక్తి అన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రకాల్చి వాత పెట్టాలని రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో గుజరాత్ వర్సెస్ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ మోదీని ఓడించి, తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని గెలిపించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్ - బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఈ ప్రచారంలో దానం నాగేందర్, వి.హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.