06-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 6: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తక్షణం విధుల్లో చేరాలన్నఈసీ ఆదేశాలతో మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన పోలీస్ బాస్‌గా విధుల్లో చేరారు. అంతకు ముందు ఆయనకు పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. కాగా, ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో విచారించిన ఎన్నికల సంఘం ఆదివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈసీ ఆదేశాలతో కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను కొత్త పోలీస్ బాస్ పోస్ట్ కోసం సిఫార్సు చేసింది. వీరిలో 1992వ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఈసీ.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా, హరీష్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.