06-05-2024 RJ
సినీ స్క్రీన్
కొరటాల శివ దర్శకత్వంతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా ’దేవర’పై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన దీని గురించి మాట్లాడుతూ.. అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలాంటి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా దర్శకుడు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాయి. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ ’దేవర’ గురించి మాట్లాడుతూ.. ’ఇటీవల తారక్ కూడా దీని గురించి మాట్లాడాడు.
ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. త్వరలోనే అప్‌డేట్స్ వస్తాయి’ అన్నారు. దీంతో ఎన్టీఆర్ పుట్టినరోజు మే20 సందర్భంగా దీని నుంచి అప్‌డేట్ వచ్చే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. తొలుత ఈ మూవీ మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని విడుదలను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.