06-05-2024 RJ
సినీ స్క్రీన్
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా 'గేమ్ చేంజర్' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శంకర్ ఈ సినిమాకి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడనున్నారని తెలుస్తోంది. ఒక పాత్రకి కియారా అద్వానీ కథానాయిక కాగా, ఇంకో పాత్రకి అంజలి కథానాయిక. ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు వున్నారు, అందులో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్రఖని, జయరాం లాంటి వారు నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా మళ్ళీ వార్తల్లో ఉంది. సినిమా చిత్రీకరణ జరుగుతుండగా లీకయిన సన్నివేశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో పంచె కట్టులో ఉన్నా రామ్ చరణ్, శ్రీకాంత్‌ని హగ్ చేసుకుంటూ ఉన్న సన్నివేశం లీకయింది. మెగా అభిమానులు ఈ సన్నివేశం చూసి, ఇది థియేటర్ లో అయితే అదిరిపోతుంది అని సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
మామూలుగా పెద్ద సినిమాలు చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ సెట్ పైకి తీసుకెళ్లనివ్వరు, కానీ మరి ఈ సన్నివేశం ఎలా లీకయిందో కూడా అర్థం కావటం లేదు అని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.అయితే ఇదేమీ మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఈ చిత్రం నుండి, అలాగే వేరే చిత్రాల నుండి కూడా ఇలా చిత్రీకరణ సమయంలో సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని అంటున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా అవుట్ డోర్ లో చెయ్యడం వలన మొబైల్స్ పై కంట్రోల్ ఉండదని చెపుతున్నారు. ఏమైనా ఈ సినిమాపై అంచనాలు చాలా భారీగా వున్నాయి. రామ్ చరణ్ ’ఆర్‌ఆర్‌ఆర్’ తరువాత చేస్తున్న సినిమా ఇదే కావటం, ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.