08-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 8: వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను నెరవేర్చడమే గాకుండా, గత పాలకుల అవినీతిపైనా పోరాడుతుందని అన్నారు. ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్ దుకాణం బంద్ అవుతుందని అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విూట్ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5న 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. బీఆర్‌ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు. డీ లిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 సీట్లు అవుతాయన్నారు. 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. కవితను చూస్తే చాలా నవ్వొస్తోందని అన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుంది అనుకున్నామని.. కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని మేం గుర్తించలేదని కోమటిరెడ్డి అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందన్నారు. తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని ఫుట్ బాల్ ఆడుకుంటానన్న తలసాని మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం రూం నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు డిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారన్నారు. కానీ తాను మాత్రం ఎక్కడికీ వెళ్ళలేదని అన్నారు. కవిత వల్ల మన పరువు పోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలువదన్నారు. జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. . కేసీఆర్ సచ్చిన పాములాంటోడన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని మంత్రి అన్నారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు. రాముడి పేరు విూద బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు ప్రధానిగా ఉండి.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి మోడీకి పట్టిందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేశానికి గురయ్యారు . ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయం చేస్తుందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో భారీ మోసం జరుగుతుందని చెప్పారు. అంబానీ, అదానీ చేతుల్లోనే దేశ సంపద ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 నుంచి 15 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవన్నారు. మన దేశంలోనూ రష్యా, చైనా తరహా పాలన వస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్ వేశారు. వాళ్లంతా రోడ్ల విూదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిపోయిందని.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకుగానూ 14 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ లక్ష్యం 15 స్థానాల్లో విజయం సాధించడమని, అయితే 14 స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. జూన్ 5 తరువాత దేశంలో చాలా మార్పులు వస్తాయన్నారు.