08-05-2024 RJ
తెలంగాణ
వేములవాడ/హన్మకొండ, మే 8: రాష్ట్రంలో మరో రెండుమూడు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో 400 సీట్ల టార్గెట్‌లో భాగంగా తెలంగాణలో అత్యధిక ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యంగా బిజెపి ప్రచారం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. మంగళవారమే హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ గురువారం ఉదయం వేములవాడ, హన్మకొండల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లపై విమర్వల దాడి పెంచారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తమపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. అంతేగాకుండా కాంగ్రెస్ రిజర్వేషన్లపై కుట్రలు చేస్తోందని ప్రజలను హెచ్చరించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లలో కోత పెట్టి ముస్లింలకు ఇవ్వాలని చూస్తోందని, ఈ విషయంలో ఈ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేశారు. ఇలాంటి రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ తీరుతో ఓబీసీలకు నష్టం జరుగుతుందన్నారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టబడి ఉన్నామని అన్నారు.
ఇకపోతే అయోధ్యలో భవ్యరామమందిరం నిర్మాణం చేపట్టామని, దీనిని కాంగ్రెస్ బహిష్కరించిందని అన్నారు. రామాలయానికి తెలంగాణ నుంచే ద్వారం అందిందని గుర్తించారు. అయితే అయోధ్య కేసును తిరగ దోడాలని కూడా చూస్తోందని అన్నారు. ఇది మనకెంత అవమానమో గుర్తించాలని ప్రజలను మోదీ కోరారు. ఇది విూకు సమ్మతమేనా అని ప్రశ్నించారు. అలాగే ఇంతకాలం ఆదానీ, అంబానీల జపం చేసిన కాంగ్రెస్ ఎన్నికలు రాగానే వారిగురించి మాట్లాడడం లేదని, వారి నుంచి ఎంత ముట్టచెప్పుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడున్న ఒక ఆర్.. ట్యాక్స్ వసూలు చేసి, ఢల్లీిలో ఉన్న మరో ఆర్ కు కప్పం కడుతోందని ప్రధాని మోదీ అన్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగిన సభలో మోదీ నిప్పులు చెరిగారు. బీజేపీ వేములవాడ సభలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చెలరేగిపోయారు. తెలంగాణ గట్టు విూద తమ ప్రత్యర్థులిద్దరూ ఒక్కటేనని చాటడానికి ఉదాహరణలు, పంచ్‌లతో ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కలెక్షన్లలో ట్రిపుల్ ఆర్ సినిమాని డబుల్ ఆర్ ట్యాక్స్ మించిపోయిందని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ట్రిపుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. డబుల్ ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ విలువను దాటేసిందన్నారు. డబుల్ ఆర్ టాక్స్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్నారు. అవినీతి సిండికేట్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ భాగస్వాములంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పారు.. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్' అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేక పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్‌పై చర్యలు తీసుకోవట్లేదని ప్రధాని మోదీ ఆరోపించారు.అందుకే అవినీతిలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ తోడుదొంగలని మోదీ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యవసాయ, ఆర్థిక సంఘాలని అణచివేసిందని.. మోదీ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదవ పెద్ద అర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని.. 360 అర్టికల్ రద్దు, రక్షణ అయుధాలు దిగుమతి స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు. మే 13న తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాపాలను కడిగి ఖతం చేయాలని..కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ బీజేపి అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరారు. ఈ మేరకు అబ్యర్థులను వేదికపై ప్రజలకు పరిచయం చేశారు. వీరిని గెలిపిస్తే నేరుగా తనకు మద్దతు తెలిపినట్లని అన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి మోడీ వచ్చి వెళ్లారని, తన నమస్కారం తెలిపి ఓటు అడగాలన్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ భాజపా, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు.
సభ ప్రారంభానికి ముందు శ్రీరాజరాజేశ్వరస్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘దక్షిణ కాశీ భగవానుడు శ్రీరాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. విూ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మార్చాం. ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇక్కడ భారాస ప్రభావం మచ్చుకైనా కనిపించట్లేదు. కాంగ్రెస్, భారాసలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. భాజపా మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ’కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..’ ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. భారాస, కాంగ్రెస్ రెండూ ఒకటే.. నాణెళినికి బొమ్మాబొరుసులాంటివి. అవి అవినీతి పార్టీలు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కాలరాశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి కుటుంబ లబ్ది కోసమే భారాస పనిచేసింది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసింది. వంశపారంపర్య రాజకీయాలతో దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా ఆ పార్టీ అవమానించింది. ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి అనుమతించలేదు. పీవీకి భారతరత్న ప్రకటించి భాజపా గౌరవించింది. దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. పీవీ కుటుంబంలోని మూడు తరాల సభ్యులను కలిశాను. వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అవినీతిలో కాంగ్రెస్, భారాసది ఫెవికాల్ బంధం. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్‌గా మారుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.. అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోందని మోదీ అన్నారు.
ఇక్కడి నుంచి నేరుగా హన్మకొండ సవిూపంలోని మడికొండలో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లొద్దన్నారు. కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి ఈ నగరాన్ని కాపాడాలన్నారు. వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోందని చెప్పారు. నాలుగో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు చూడాలంటే భూతద్దం సరిపోదని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా కూటమితో ఏడాదికో ప్రధాని మారుతారని చెప్పారు. ఏడాదికో ప్రదాని ఉంటే.. దేశం బాగుపడుతుందా? అని ప్రశ్నించారు.ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దేశం ఆగం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉంటాయన్నారు. కుంభకోణాలు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ అని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి.. దాన్ని పంద్రాగస్టుకు తీసుకెళ్లారని.. దేవుడిపై ఒట్లు వేస్తున్నారని ప్రధాని విమర్శించారు.
కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందా?, ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 జమ చేసిందా అని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలకు ఇస్తామన్న 250 గజాల జాగ ఏమైందని ప్రధాని నిలదీశారు. రాష్ట్రంలో పవర్ కట్స్, నీళ్ల కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల ప్రజలు ఆలోచించి ఇక్కడి నుంచి నిలబడ్డ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేశ్, డాక్టర్ సీతారామ్ నాయక్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే వేముల వాడ సభలో బండి సంజయ్, గోడం నగేశ్, గోమాస శ్రీనివాస్‌లను ప్రజలకు చూపుతూ అత్యదిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వీరిని తన ప్రతినిధులుగా గుర్తించాలన్నారు.