09-05-2024 RJ
తెలంగాణ
మెదక్, మే 8: అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హావిూని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను.. అందర్నీ కాంగ్రెస్ పార్టీ వంచించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హావిూలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గత 15 రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం నాడు మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని ప్రశ్నించారు. రైతుబంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తారంట.. పొలం దున్నినోళ్లకే ఇస్తారంట అని కేసీఆర్ అన్నారు. ఇంతకుముందు అట్ల వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా? అని ప్రశ్నినంచారు.
రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇయ్యాలి.. కానీ కోతలు అయినయ్.. కల్లాలు అయినయ్ ఇప్పుడు రైతుబంధు వేస్తామని అంటారు. ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటదా? అని అడిగారు. తల, తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని మండిపడ్డారు. కరెంటు కోతల కారణంగా హైదరాబాద్‌లో పరిశ్రమలు వెళ్లిపోయే, ఐటీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్ల కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు ప్రత్యేక లైన్ వేయించినా.. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింక్ కావాలని.. శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారు.. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీళ్లు రావడం మొదలైతే.. నర్సాపూర్ బంగారు తునక అవుతుంది.. దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదనే నమ్మకం లేదు. ఆ కాల్వ పూర్తి కావాలి.. మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలి.’ కేసీఆర్ తెలిపారు.
మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదు. ఇంకా నెరవేరుస్తదనే ఆశ లేదని అన్నారు. నర్సాపూర్‌ను కేసీఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో విూ అందరికీ తెలుసని అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇచ్చిన.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చినం.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని చెప్పారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు విూద యూనివర్సిటీని పెడదామని అనుకున్నాం.. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేలా లేదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హల్దీవాగు విూద, మంజీరా నది విూద 10 చెక్‌డ్యామ్‌లు కట్టాం.. దాని ద్వారా పంటలు పండిరచుకున్నాం.. దాన్నంతా దెబ్బ తీసే పరిస్థితులు వస్తున్నాయని పేర్కొన్నారు. అంటే సాగు నీరు రాదు.. తాగునీరు రావు.. కరెంటు రాదు.. సంక్షేమం లేదు. ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్దాలు చెప్పడం చేస్తుందని మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవాలని, మెదక్ ఎంపి అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాలో పేదల గోసలు, రైతుల బాధలుండవని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. నర్సాపూర్ రోడ్‌షోలో భాగంగా కార్నర్ విూటింగ్‌లో మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’నరేంద్ర మోదీ పార్టీతో ఏమన్నా పైసా లాభమైనా ఉన్నదా? సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఏమైనా అయ్యిందా? మోదీ పాలనో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84కి పడిపోయింది. ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారనంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డునపడుతున్నరు. ఎల్‌ఐసీని ముంచే ప్రయత్నం చేస్తున్నరు. పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేటీకరణ చేస్తున్నరు’ అంటూ మండిపడ్డారు.
మోదీ ఎజండాలో పేదల బాధలు, గోసలుండయ్. రైతుల బాధలుండవు. ఢల్లీిలో రైతులు ధర్నా చేస్తే.. 750 మంది రైతులను చంపిన వ్యక్తి నరేంద్ర మోదీ. మళ్లీ యూపీ ఎన్నికలు వస్తే సారీ చెప్పి.. మాఫీ చెప్పి వేడుకున్న వ్యక్తి మోదీ. ముఖ్యంగా యువకులు, విద్యా?ర్థులు, మేథావులు, ఆలోచనపరులతో నా మనవి. ఈ రాష్ట్రం, ఈ దేశం మనది. భవిష్యత్ మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. ఓ ఒరవడిలో కొట్టుకుపోయి ఓటు వేయడం కాదు. మనకు న్యాయం జరిగాలి. నర్సాపూర్‌లో లంబాడాలు ఎక్కువగా ఉన్నరు. నేను 58 సంవత్సరాలు మొత్తుకుంటే.. ఏ ముఖ్యమంత్రి లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందే కేసీఆర్. విూకు డైరెక్ట్‌గా నిధులు పంపిందే కేసీఆర్. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు పెట్టిందే కేసీఆర్.
ఇవన్నీ ఉన్నయ్. టీఎస్‌పీఎస్సీలో గ్రూప్`1 పరీక్షలు జరుగుతున్నయ్. పరీక్షల సమయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. పదిశాతం రిజర్వేషన్లు విరుద్ధంగా ఉందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా? కొట్లాడాలి కదా? అప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించి.. కమిటీ వేసి చేసిందాన్ని నిలబెట్టాలి కదా? ఇవాళ మనం లేము. వాళ్లు మాట్లాడే పరిస్థితుల్లో లేరు’ అన్నారు. మన పదిశాతం రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా.. పార్లమెంట్‌కి వెంకట్రామిరెడ్డి వెళ్లాలి. మన తరఫున వాదించాలి. గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం. పోడు భూములకు రైతుబంధు పడ్డదా? బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు వచ్చింది.. బీమా కూడా చేశాం. ఇప్పుడు రైతుబంధు ఎవరికీ లేదు. సమాజంలో ఏ ఒక్క వర్గం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం లేదు.
అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాలి. కృష్ణా, గోదావరి నీళ్లను నరేంద్ర మోదీ తమిళనాడుకు తీసుకుపోతా అంటున్నడు. దాన్ని కాపాడాలన్నా.. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్‌ఎస్ ఎంపీలుంటేనే పార్లమెంట్‌లో పులిబిడ్డల్లా కొట్లాడుతరు. ఆ నాడు తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడినమో.. అట్ల కొట్లాడుతరు. అలా హక్కులు ఉంటయ్. ఆల్రెడి నాకు రిపోర్ట్ ఉంది. వెంకట్రామిరెడ్డి తెలంగాణ మొత్తం విూదనే అతిఎక్కువ మెజారిటీతో గెలిస్తున్నడు విూ దీవెనలతోని. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40వేల`50వేల మెజారిటీని తీసుకురావాలని కోరుతున్నానన్నారు.