09-05-2024 RJ
తెలంగాణ
ప్రధాని మోదీ ప్రచారం ఇప్పుడంతా కాంగ్రెస్‌ను విమర్శించడానికే సరిపోయింది. కేవలం కాంగ్రెస్ బూచిని చూపి బిజెపికి ఓటేయాలని ఆయన ఉభయ తెలుగు రాష్టాల్ర ప్రచారంలో స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీలో ఎక్కడో ఒకచోట కాంగ్రెస్ భయం వెన్నాడుతున్నట్లుగా కనిపించింది. ఆయన ప్రచారంలో గాంభీర్యత, ఆత్మవిశ్వాసం కానరావడంలేదు. పదేళ్లుగా దేశాన్ని గాడిన పెట్టినట్లు పలు సందర్భాల్లో ప్రకటించారు. 20కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్లుగా చెప్పుకున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించామని చెప్పుకున్నారు. దేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేశామని అన్నారు. ఇలా అనేక విషయాలు చెబుతూనే కాంగ్రెస్ వస్తే..అంటూ పేలవ ప్రసంగాలు చేస్తున్నారు. ఇన్ని చేసినా ప్రజలు మోదీని నమ్మడం లేదా అన్న అనుమానాలు కలుగు తున్నాయి. అందుకే ఆయన విపక్షాలను, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ద్వారా ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ వస్తే జరిగే అనర్థాలను ప్రకటించారే తప్ప..తన పదేళ్ల పాలనా కాలంలో గట్టిగా ఇలా సాధించామని చెప్పలేకపోయారు. దీనిని బట్టి మోదీలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రసంగం కూడా చప్పగా సాగింది. ప్రజల్లో ఉత్తేజం కలగడం లేదు. ఇప్పటికే మూడుదశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. నాలుగోదశ మే 13న జరుగనుంది. అందులో ఉభయ తెలుగు రాష్టాల్రు ఉన్నాయి. ఈ రెండు రాష్టాల్ల్రో బిజెపికి చెప్పుకోదగ్గ బలం లేదు. గత పదేళ్లలో ఈ రాష్టాల్రకు పెద్దగా ఒరిగిందేవిూ లేదు.
ఈ క్రమంలో దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరన్న ప్రశ్న ఉదయిస్తోంది. గతంలో 2004లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎన్నికల ముందు భారత్ వెలిగిపోతోందన్న నినాదం ఎత్తుకుంది. ఎన్నికల తరవాత కాంగ్రెస్ వెలిగింది. పదేళ్లు అధికారంలో కొనసాగింది. ఇప్పుడు పదేళ్లు మోదీ అధికారంలో ఉన్నారు. కేవలం మోదీ నేతృత్వంలోని బిజెపి మాత్రమే అధికారంలో ఉంది. పదేళ్లుగా మోదీ ఎంత చెబితే అంత. ఏది నిర్ణయిస్తే అదే శాసనం. ఏ నిర్ణయాల్లోనూ చర్చలు లేవు. పార్లమెంటులో అయితే అస్సలు చర్చ లేదు. ఈ క్రమంలో మోదీ ముందే కాంగ్రెస్‌కు అధికారం వస్తుందని వాసన పసిగట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన చేస్తున్న ప్రసంగాల తీరు దీనిని బలపరుస్తోంది. అందుకే కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. అన్న చర్చ సాగుతోంది. మళ్లీ మోదీ వస్తాడన్న ధీమా ప్రజల్లో కూడా కానరావడం లేదు. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపైనా ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి బలంగా విశ్వసిస్తోంది. ఎన్డీయే బలం గతంకంటే పెరిగింది..
ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ చెప్పుకుంటోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఈ మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితేనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, రానున్న నాలుగు విడతల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగతా చోట్ల ఇండియా కూటమికి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మొదటి మూడు విడతల్లోనే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అన్ని స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ మూడు రాష్టాల్ల్రో కలిపి 87 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి పక్షాలు ఎక్కువ సీట్లు గెలవగా.. ఎన్డీయే కూటమి కర్ణాటకలో మాత్రమే ప్రభావం చూపించింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ లోని మొత్తం స్థానాలతో పాటు మహారాష్ట్రలో 48 స్థానాలకు గానూ 24 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 112 స్థానాల్లో ఇండియా కూటమి కనీసం వంద స్థానాలకుపైగా గెలుచుకో గలుగుతుందని అంచనా వేస్తున్నారు.
కేరళ, తమిళనాడులో కలిపి 59 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మూడు విడతల్లో కలిపి దాదాపు 150 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఇండియా కూటమి మరో నాలుగు విడతల్లో జరగనున్న 260 స్థానాల్లో 100 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటే అధికారంలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మరో నాలుగు విడతల్లో ఎక్కువ సీట్లు సంపాదించాలని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌పై ప్రత్యక్ష దాడికి దిగారు. దానిని వంశపారంపర్య పార్టీగా, దేశంలో అన్ని అవలక్షణాలకు కారణంగా చెబుతూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం తీర్పును తిరగతోడుతారంటూ హెచ్చరిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మొదటి మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. అదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, యూపీలో బీజేపీ బలంగా ఉంది. ఈ రాష్టాల్ల్రో 127 స్థానాలు ఉన్నాయి. వీటిలో వందకు పైగా గెలుస్తామని ఎన్డీయే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమిళనాడులో ఎన్డీయే కూటమి 5 నుంచి 10 సీట్లు సాధిస్తుందని, కర్ణాటకలో 15కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. తరువాత నాలుగు విడతల్లో జరగనున్న 260 స్థానాల్లో కనీసం 150 స్థానాల్లో గెలిచినా అధికారానికి ఢోకా లేదని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
నాలుగు, ఐదు, ఆరు, ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్న రాష్టాల్ల్రో జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తెలంగాణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనే 54 స్థానాలు ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లో 25 స్థానాలు ఉండగా.. ఇక్కడ టీడీపీతో కలిసి బీజేపీ పోటీచేస్తోంది. ఎన్డీయే కూటమికి ఏపీలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండగా డబుల్ డిజిట్ సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. కనీసం 6 నుంచి 7 స్థానాలు తప్పకుండా సాధిస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం తక్కువలో తక్కువ తమకు 270 నుంచి 300 ఈజీగా వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో చివరి నాలుగు విడతల్లో ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా మోదీ ప్రచారం సాగుతోంది. అయితే చేసిన అభివృద్దిని గట్టిగా చెప్పలేని దైన్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడమే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. ఇది దేనికి సంకేతమన్నది జూన్ 4న ఫలితాలను బట్టి వెల్లడి అవుతుంది.