09-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 9: ఈనెల 13న లోక్‌సభ పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలు ఓటర్ల వేటలో పడ్డాయి. ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిలు బృందాలను ఏర్పాటు చేసి వార్డుల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. పోల్ చిట్టీలు అందచేస్తున్నారు. పనిలోపనిగా ఓట్లు వేయమని కోరుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇంటింటి ప్రచారం మొదలయ్యిందనే చెప్పాలి . ఎండకాక ముందే ఉదయమే గుంపుగా కొందరు ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారు. ఈ క్రమంలో ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. జాబితా ప్రకారం చిరునామాలో ఓటర్లు ఉన్నారా.. లేరా ? అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఇల్లు మారితే ఎక్కడుంటున్నారు ? వారి చిరునామా, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంతో ఈసారి మరింత పోలింగ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సొంతిళ్లలో ఉన్న ఓటర్లతో ఇబ్బంది లేకున్నా తరచూ ఇళ్లు మారే వారి అడ్రస్సులు తెలుసుకోవడం కత్తివిూద సాములా మారుతోందని నాయకులు అంటున్నారు. ఓటరు జాబితా ప్రకారం ఆయా ఇంటిలో పేరు ఉండి.. ఓటరు లేకపోతే అతని కోసం వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కువగా కిరాయిదారుల విషయంలో ఓటరు దొరకడం కొంత కష్టంగా మారింది. కిరాయిదారులు తరచూ ఇళ్లు మారుతుండడంలో ఓటరు జాబితా ప్రకారం సూచించిన చిరునామాలో ఉండడం లేదు. దీంతో వారి కోసం కార్యకర్తలు ఇంటి యజమానులు, చుట్టుపక్కల వారి దగ్గర సమాచారం సేకరిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి వారిని కలుస్తున్నారు. పోలింగ్ రోజున తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఓటరు అన్వేషణలో బీజేపీ కొంచెం ముందుంది. గ్రేటర్‌లో నాలుగు లోక్‌సభ నియోజక వర్గాలుండగా, 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్‌లను విడదీసి.. ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు పోలింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పోలింగ్ బూత్ ఇన్ చార్జితో పాటు ఇద్దరు, ముగ్గురు కార్యకర్తలు ఇంటింటికి వెళుతున్నారు. ఓటరు జాబితా పట్టుకుని..తాము పార్టీ నుంచి వచ్చామని, వివరాలు సేకరిస్తున్నట్లు ముందుగానే ఆయా కుటుంబాలకు చెబుతున్నారు. ఓటరు, అతని కుటుంబ సభ్యులు ఉంటే జాబితాలో ’టిక్’ చేసుకుంటున్నారు. లేనివారి గురించి ఆరా తీస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి ఓటరు సమాచారం సేకరించడం వల్ల పోలింగ్ నాడు ఓటర్లను సులువుగా గుర్తించడానికి వీలుంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఇంటింటికి వెళ్లిన పోలింగ్ బూత్ ఇన్ చార్జి లేకపోతే, అతని వెంట వెళ్లిన కార్యకర్తలకు పోలింగ్ నాడు ఏజెంట్‌గా నియమించనున్నారు. దీంతో ఇంటింటికి వెళ్లి తయారు చేసిన జాబితాను పోలింగ్ బూత్ ఏజెంట్‌కు ఇస్తారు. ఆయా చిరునామాలో ఓటరు వివరాలపై ముందుగానే సదరు ఏజెంట్‌కు అవగాహన ఉండడం వల్ల ఒకరి ఓటును మరొకొరు వేయడానికి ఏజెంట్ నిరోధించడానికి అవకాశముందని అంటున్నారు.