11-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 11: హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డవారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. శనివారం నుంచి మూడు రోజులు సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళ్లారు. దీంతో విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. మే 13న పోలింగ్ కావడం, వరుసగా మూడు రోజులు సెలవుల కారణంగా ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఏపీలో ఓట్ల పండుగ మొదలు కానుంది.
ఎన్నికల వేళ అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ ` విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. వారాంతం, వరుస సెలవులు, పోలింగ్‌కు ఇంకా రెండు రోజులే టైం ఉండడంతో శనివారం వేకువజాము నుంచే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.
ఈ వాహనాలు విజయవాడ విూదుగా రాజమహేంద్రవరం, విశాఖ వైపు తరలివెళ్తున్నాయి. జాతీయ రహదారిపై రద్దీ నేపథ్యంలో నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు, హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెంట్ వరకూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. అటు, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఉదయం నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించు కోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది. అయితే ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో సరిపడా బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లకు గురయ్యారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఎంజీబీఎస్, జేబీఎస్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వరసగా మూడు రోజుల సెలవులు, ఓటు వినియోగం నేపథ్యంలో నగర వాసులు సొంతుళ్ల బాటపట్టారు. స్పెషల్ బస్సులు టైంకి రాకపోవడంతో ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులుకాస్తున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ, బెంగళూరు వెళ్లే వారికి అదనపు చార్జీలతో బాదుతున్నారు. దాదాపు 50శాతం టికెట్ రేట్లను ప్రైవేట్ ట్రావెల్స్ పెంచేశాయి. ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులపై రూ.3 వేల వరకు చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పెంచేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా అక్కడికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్` విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అవుతోంది. వారాంతం కావడం, పోలింగ్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ విూదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.