12-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 12: అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద జరిగింది. ఈ నెల 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం సందర్భంగా జలపాతం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు జలపాతంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి కోసం గాలింపు ప్రారంభించగా మొదటి రోజు వీరి ఆచూకీ లభించలేదు. రెండో రోజు వీరి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో తెలంగాణ విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి.. ఖమ్మం నగరంలోని విద్యా రంగ ప్రముఖులు లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. ఇతను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
ఇక మరో విద్యార్థి రోహిత్ మణికంఠ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కుమారుడి స్నాతకోత్సవం వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవలే రాకేశ్ తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. అయితే, అనుకోని ప్రమాదంలో అతను మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఈ జలపాతం వద్ద 9 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక, ఏప్రిల్ లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన స్కాట్లాండ్ లో జరిగింది. వీరిలో ఒకరు హైదరాబాద్ విద్యార్థి కాగా.. మరో విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. స్కాట్లాండ్ లోని యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.. పెర్త్ ్గªర్ లోని లిన్ ఆఫ్ తమ్మెల్ కు వెళ్లారు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు.
సమచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతులు జితేంద్రనాథ్ (26), చాణక్య (22)గా గుర్తించారు. అగ్రరాజ్యంలో ప్రమాదవశాత్తు విద్యార్థుల మరణాలు ఓ వైపు ఆందోళన కలిగిస్తుంటే.. కొందరు తెలుగు విద్యార్థుల అదృశ్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. హన్మకొండకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది చికాగోలో విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చివరిసారిగా ఈ నెల 2న మధ్యాహ్నం రూపేశ్ తో తండ్రి వాట్సాప్ కాల్ లో మాట్లాడారు.
ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్చాఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు. అతని స్నేహితులతో మాట్లాడగా.. ఎవరినో కలవడానికి వెళ్లారని వారు ఎవరో తెలియదని రూపేశ్ స్నేహితులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని కోరారు.