12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 12: ముఖ్యమంత్రి జగన్ సభలకు ఆగమేఘాలపై బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు.. సాధారణ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోవడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు వస్తున్న ఏపీ వాసుల కోసం అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లిన ఏపీ వాసులు ఓటు వేయాలనే బాధ్యతతో స్వస్థలాలకు వస్తున్నారు. వారికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత. ఈ విషయాన్ని ముందుగా అంచనా వేయకుండా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం దురదృష్టకరం.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వస్తున్న వారి ఇబ్బందులు జనసేన పార్టీ దృష్టికి వచ్చాయి. ఎన్నికల సంఘం అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ఆదేశాలివ్వాలి‘ అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.