12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కర్నూలు, మే 12: తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవిత్ర తోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తుంది.
ఇక పవిత్ర జయరామ్ విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. అలా కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె.. త్రినయని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం అలరించారు. ఇక పవిత్ర జయరామ్ మరణవార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్టీ ప్రముఖులు సంతాపం తెలిపారు.