12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 12: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్టాల్ర నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షించారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.
అటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా లేక ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే రెగ్యులర్ సర్వీసులు కూడా ఏ మాత్రం సరిపోవడం లేదు. ఏ ప్రాంతానికీ ప్రత్యేక బస్సులు తిరగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సుల కోసం పాసింజర్స్ గంటల తరబడి వేచి చూస్తున్నారు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కనీసం రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను, సిబ్బందిని కూడా ఆర్టీసీ పెంచలేదు. దీంతో ఆర్టీసీ తీరు పట్ల ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.