13-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు, మే 13: సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ కార్యకర్తలు, ఓటర్లు, రిపోర్టర్లపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఏలూరులోనూ వైసీపీ నేతల అరాచకం బయటపడిరది. ఏలూరు శివారులోని పోణంగి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. స్థానిక వైసీపీ నేత ఈ దారుణానికి ఒడిగట్టాడు. బయటి నుంచి ప్రత్యేకంగా గూండాలను తీసుకొచ్చి మరీ తెలుగుదేశం కార్యకర్తలను కొట్టించాడు.
ఈ దాడిలో ఓ టీడీపీ కార్యకర్త పీక వద్ద తీవ్ర గాయం కావడంతో.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం స్వాతి సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్ ఖాన్ వర్గానికి, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జలీల్ ఖాన్‌కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నినాదాలు చేస్తూ.. ఆయనపై దాడికి దిగారు. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన జలీల్ ఖాన్ వర్గీయులు.. వారిపై తిరగబడ్డారు. ఇదే సమయంలో.. వైసీపీ మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది. పోలీసులు రంగంలోకి దిగి.. స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. మరోవైపు.. తిరుపతిలోని బ్రాహ్మణ కాల్వలోని పోలింగ్ బూత్ వద్ద వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి రెచ్చిపోయారు.
ఓ రిపోర్టర్‌పై దుర్భాషలాడుతూ.. ఆయన ఫోన్ తీసుకొని, నేలకేసి కొట్టి పగలకొట్టారు. పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ళ మండలం మాదల పోలీంగ్ బూత్ వద్ద కూడా వైసీపీ శ్రేణులు చెలరేగిపోయారు. ఎన్నికల నిబంధనల్ని అతిక్రమిస్తూ.. పోలింగ్ బూత్‌పై రాళ్లు రువ్వారు. స్థానిక ఓటర్లందరూ టీడీపీకి ఓట్లు వేస్తున్నారన్న విషయం తెలిసి.. ఆ అక్కసుతో వైసీపీ వాళ్లు రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ సానుభూతిపరులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన కొందరు.. ఆందోళన చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అటు.. పరిస్థితుల్ని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.