13-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఇసి సీరియస్
తెనాలి వైకాపా అభ్యర్థి గృహనిర్బంధానికి ఆదేశం
పుంగనూరు ఎస్‌ఐ సస్పెన్షన్ కు ఆదేశం
వైకాపా తీరుపై టిడిపి ఆగ్రహం.. ఇసికి ఫిర్యాదు
120 ఘటనలు జరిగాయని కనకమేడల వెల్లడి
అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల వైకాపా శ్రేణులు దాడులుకు దిగాయి. గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై గృహనిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 4-6 గంటల మధ్య ఎలాంటి ఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. ఉదయం నుంచి రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది.
పోలింగ్ కేంద్రంలో శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. వైకాపా అభ్యర్థి చెంప చెళ్లుమని పించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇసికి టిడిపి ఫిర్యదు చేసింది. ఉదయం నుంచి ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెదేపా మాజీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
పోలింగ్ వేళ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ఈమేరకు తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను కనకమేడల ఈసీకి అందజేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘అన్ని చోట్లా వైకాపా నేతలు హింసకు పాల్పడుతున్నారు. తెదేపా కార్యకర్తలు, ఏజెంట్లు, నేతలపై దాడి జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైకాపా అభ్యర్థులు, నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట వైకాపా అభ్యర్థులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పల్నాడు, తాడిపత్రి, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడం దారుణం. ఈవీఎంలు ధ్వంసం చేసి, పలు చోట్ల ఓట్లు వేయకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. శాంతిభద్రతల పరిణామాలు, ఓటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో మరోసారి పోలింగ్ నిర్వహించాలని కోరాం అని కనకమేడల తెలిపారు.