13-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలలోపు నిల్చున్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా సజావుగా పోలింగ్ కొనసాగింది. కాగా వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్ 228/77లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటలుగా ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటింగ్‌ను నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మంథని..బెల్లంపల్లి లో ఎక్కవ శాతం ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే మంచిర్యాల లో సమయం ముగిసినప్పటికి ఓటర్లు బారులు తీరారు.
అయితే ఉదయం నుంచే మందకొడిగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. నగరంలో అయితే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. 65 శాతం దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ పక్రియ ముగిసింది. తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ముగిసింది.
ఉదయం మొదలయిన పోలింగ్ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ పక్రియ ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81 శాతం, భువనగిరిలో 72.34 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, కరీంనగర్‌లో 67.67 శాతం, ఖమ్మంలో 70.76 శాతం, మహబూబాబాద్‌లో 68.60 శాతం, మహబూబ్‌నగర్‌లో 68.40 శాతం, మల్కాజ్‌గిరిలో 46.27 శాతం, మెదక్‌లో 71.33 శాతం, నాగర్‌కర్నూల్‌లో 66.53 శాతం, నల్లగొండలో 70.36 శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, వరంగల్‌లో 64.08 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ లో 47.88 శాతం ` హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88
శాతం నమోదైంది. హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు ఓటరుపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో సాయంత్రం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి తండా వాసులు పోలింగ్ బహిష్కరించగా.. అధికారులు నచ్చచెప్పడంతో ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చారు. కాగా, సమస్యలు పరిష్కరించలేదని గిరిజనులు ఓటింగ్ బహిష్కరించారు.
హైదరాబాద్ పాతబస్తీ విూర్ చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒకే రూట్ లో మాధవీలత, ఒవైసీ పోలింగ్ కేంద్రాలు పరిశీలించాన్నారు. రెండు వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళం నెలకొంది. మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఎన్నికల సిబ్బంది, కొందరు స్థానిక నేతలు ఇంటింటికీ తిరుగుతూ తలుపులు కొట్టి మరీ ఓటర్లను పిలిచారు. అంతా ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లతాండా పోలింగ్ బూత్ 160లో బాలకృష్ణ అనే ఓటర్ ఓటు వేసే దృశ్యాలను మొబైల్ లో వీడియో తీశాడు. తన తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో ఫోన్ తో పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసిన వీడియోను సదరు ఓటరు సోషల్ విూడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది అభ్యంతరం తెలిపారు.