13-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 13: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ పక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ ఈ పోలింగ్ సెంటర్‌కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఒకానొక సందర్భంలో పోలింగ్ బూతులోకి దూసుకొని వచ్చారు కొందరు వీరాభిమానులు. అయితే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.